Telangana Write Letter to Krishna River Board : నాగార్జునసాగర్(Nagarjuna sagar issue) ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌ను తెలంగాణనే నియంత్రించాలని ఈఎన్సీ పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం
అందుకు అనుగుణంగా నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేశారు. డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మురళీధర్ విజ్ఞప్తి చేశారు.
అసలు వివాదమేమిటంటే.. ఇటీవల సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు ఘర్ణణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రోజు బుధవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్దసంఖ్యలో సాగర్‌ను మోహరించారు. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కుడి కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది.
Nagarjuna Sagar Dam Dispute : ఇందులో భాగంగా దిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర జల సంఘం, కేఆర్ఎంబీ (KRMB) ఛైర్మన్లు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు భేటీ నిర్వహించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఇందులో చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్‌లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సాగర్, శ్రీశైలం వివాదంపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని ఈ నెల 6కు జలశక్తి శాఖ వాయిదా వేసింది. ఆదివారం రోజున తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా భేటీని వాయిదా వేయాలన్న తెలంగాణ అభ్యర్థనతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితి గురించి ఏపీ అధికారులు జలశక్తి శాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో స్పందించిన జలశక్తి శాఖ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్ పంపిన ఇండెంట్‌పై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఆదేశించింది. అప్పటివరకు సాగర్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని ఏపీకి సూచించింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
సీఆర్పీఎఫ్ బలగాల అధీనంలోకి సాగర్ డ్యామ్ - వెనుదిరిగిన తెలంగాణ పోలీసులు