Telangana Rains:తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిన్న ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని వివరించారు.