Weather Report: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది.
పశ్చిమ బంగాల్ నుంచి ఝార్ఖండ్ ఇంటీరియర్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడినట్లు తెలిపింది. ఈరోజు తూర్పు విదర్భా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ద్రోణి ఈరోజు తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ధ కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అప్పుడే.. నడి వేసవికాలంలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాల మాడు పగలగొడుతున్నాయి. ఎండలు మండిపోతున్న క్రమంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: