దేశం మొత్తమ్మీద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్సలు(ఐపీ) పొందడంలో 79 శాతం చికిత్సలతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని బట్టి రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి సంఖ్య అధికంగా ఉందని అర్థమవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర(78 శాతం), ఉత్తర్‌ప్రదేశ్(73 శాతం), కర్ణాటక(73 శాతం), ఆంధ్రప్రదేశ్(72 శాతం), పంజాబ్(71 శాతం) రాష్ట్రాలున్నాయి. జమ్మూ కశ్మీర్(9 శాతం), హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ప్రజలు అధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.
దేశంలో వేధిస్తున్న వైద్యుల కొరత
మరోపక్క దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జనరల్ సర్జన్లు, గైనకాలజిస్ట్‌ల వంటి నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెద్ద రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 51 శాతం, తమిళనాడులో 36 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 26 శాతం, రాజస్థాన్‌లో 25 శాతం, కర్ణాటకలో 14 శాతం, తెలంగాణలో 13 శాతం, గుజరాత్‌లో 12 శాతం చొప్పున ఉంది. అలాగే అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ వైద్యులతోపాటు ఇతర మానవ వనరుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు 2018 గణాంకాల ప్రకారం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయుల్లో వైద్యులు 5 శాతం, ల్యాబ్ టెక్నీషియన్ 33 శాతం, ఫార్మాసిస్ట్ 15 శాతం కొరత ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘భారత ఆరోగ్య వ్యవస్థపై సమీక్ష’ పేరిట ‘ఆసియా పసిఫిక్ అబ్జర్వేటరీ ఆన్ హెల్త్ సిస్టమ్స్ అండ్ పాలసీస్ సంస్థ’ నిర్వహించిన అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక పేర్కొంది.
కిక్‌బ్యాక్ ధోరణి పెచ్చుమీరుతోంది
రోగిని ప్రాథమిక స్థాయి నుంచి మెరుగైన చికిత్స కోసం.. కార్పొరేట్ ఆసుపత్రికి పంపించినందుకు(రిఫరల్) ఆ హాస్పిటల్ నుంచి కొంత మొత్తం పంపినవారికి తిరిగి అందజేసే(కిక్‌బ్యాక్) ధోరణి పెచ్చుమీరుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్యుల నుంచి ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సుమారు 40 శాతం వరకూ ముడుపులు, బహుమతు(వైద్యపరికరాలు)లు ముడుతున్నట్లుగా తేటతెల్లమైంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో 529 వైద్య కళాశాలలుండగా.. వీటిలో 92,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటి అనుబంధ ఆసుపత్రుల్లో 4.55 లక్షల పడకలున్నాయి. మొత్తం సీట్లలో 54 శాతం ఎంబీబీఎస్ సీట్లు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్నాయి.
ప్రైవేటు వైద్యరంగం గణనీయమైన పురోగతి
1980 నుంచి 2004 మధ్య కాలంలో ప్రైవేటు వైద్యరంగం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 8 రెట్లు పెరగ్గా.. ప్రభుత్వ వైద్యంలో రెట్టింపే అయింది. ప్రైవేటు వైద్యంలో నర్సింగ్ హోంలో సగటున 14 పడకలుండగా.. కార్పొరేట్ హాస్పిటల్‌లో సగటున 177 పడకలున్నట్లుగా నివేదిక వెల్లడించింది. దేశం మొత్తమ్మీద గల పడకల్లో 46 శాతం 50 లక్షలు మించి జనాభా గల అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లోనే ఉన్నాయి.
2017-18 గణాంకాల ప్రకారం
2017-18 గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పు జరిగినా గ్రామీణంలో జేబుల్లోంచి రూ.2,084 ఖర్చవుతుండగా..ప్రైవేటులో రూ.12,931 ఖర్చవుతోంది. ఇదే గ్రామాల్లో సిజేరియన్ జరిగితే ప్రభుత్వ వైద్యంలో రూ.5,423.. ప్రైవేటులో రూ.29,406 వ్యయమవుతోంది. నగర వైద్యంలో కాన్పు ఖర్చులను పరిశీలిస్తే.. ప్రభుత్వ వైద్యంలో సహజ ప్రసవానికి అదనంగా రూ.2,459.. ప్రైవేటులో 17,960 ఖర్చవుతోంది. నగరాల్లో సిజేరియన్ జరిగితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.5,504 ఖర్చవుతుండగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.37,508 చొప్పున వ్యయాన్ని భరించాల్సి వస్తోంది.
భారత్‌లో ఓపీ సేవల్లో వైద్యం కోసం అధికంగా ప్రైవేటు క్లినిక్‌లపైనే రోగులు ఆధారపడుతున్నారు. ప్రభుత్వ వైద్యంలో అధికంగా గ్రామీణంలో వెళ్తుండగా.. నగరాల్లో ప్రైవేటు వైద్యంలో ఎక్కువగా చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 4.3 శాతం మంది ప్రజలు ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్