TS TET Notification 2023 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం tstet.cgg.gov.inలో చూడాలని అధికారులు తెలిపారు.
Telangana TET Notification 2023 : ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ మరోసారి నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. ఉపాధ్యాయ నియామకాలు, మన ఊరు మన బడిపై చర్చించారు. టెట్ నిర్వహణకు కసరత్తు చేయాలని విద్యాశాఖకు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రేపటి నుంచి ఈనెల 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టెట్ ఛైర్‌పర్సన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 9 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెప్టెంబరు 15న ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్.. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ పరీక్ష జరగనుంది. సెప్టెంబరు 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత టెట్‌తో పోలిస్తే పరీక్ష ఫీజు వంద రూపాయలు పెంచి.. ఒక పేపర్ లేదా రెండు పేపర్లు రాసినా 400 రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 13,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర సర్కార్ సంవత్సరం క్రితమే ప్రకటించింది.
TET Results 2022 : టెట్ పేపర్-2లో డబుల్ ఉత్తీర్ణత
టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం : టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు అర్హులు. పేపర్-వన్‌లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్-టూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. గత సంవత్సరం జూన్ 12న నిర్వహించిన టెట్ పేపర్-1లో 1,04,078 మంది.. పేపర్-2లో 1,24,535 మంది అర్హత సాధించారు.
ఉమ్మడి ఏపీలో 2011 జూన్.. 2012 జనవరి, జూన్, 2014 మార్చిలో టెట్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 మే, 2017 జులై, గత సంవత్సరం జూన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. ఇంతకుముందు ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సి వచ్చేది. ఇందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ.. ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అందుకనుగుణంగా విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11 నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది.
ఇవీ చదవండి: టెట్ పరీక్ష.. 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి.. అనుమతించని అధికారులు