MLC Teacher elections in Telangana: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ పక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా కొనసాగినట్లు అధికారులు ప్రకటించారు.
2023 Teacher MLC Elections polling: మధ్యాహ్నం 2 గంటల సమయానికి 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించిన అధికారులు సాయంత్రం 4 గంటల సమయానికి దాదాపు 90.40 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి మహబూబ్ నగర్ జిల్లాలో 87.75 శాతం , నాగర్ కర్నూల్ జిల్లాలో 93.96, వనపర్తి జిల్లాలో 93.48, గద్వాల్ జిల్లాలో 97.15, నారాయణపేట్ జిల్లాలో 93.77, రంగారెడ్డి జిల్లాలో 86.90, వికారాబాద్ జిల్లాలో 94.76 , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 83.54 , హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. సరాసరిగా 90.40శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు అధికారకంగా ప్రకటించారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతను రాచకొండ సీపీ చౌహాన్ పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వికాస్ రాజ్ పరిశీలించారు. అధికారులను సమన్వయం చేస్తూ పలు సూచనలు చేశారు. ఈనెల 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
MLC Elections in Andhra Pradesh: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పట్టభద్ర, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని సెయింట్ థెరిసా పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం ఘర్షణకు దిగి దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చదవండి:
ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయండి: కేటీఆర్
దిల్లీ లిక్కర్ స్కామ్.. అరుణ్ పిళ్లై కస్టడీ 3 రోజుల పాటు పొడిగింపు