TS Gurukul Notification 2023: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు అత్యధికంగా మహిళలకే రిజర్వయ్యాయి. నిన్న 4,006 పోస్టులకు సమగ్ర ప్రకటన వెలువడగా.. అందులో 3012 పోస్టులు అంటే 75 శాతం అతివలకే కేచాయించారు. జనరల్ అభ్యర్థుల కోటా కింద కేవలం 994 అంటే.. 25 శాతం పోస్టులు మాత్రమే దక్కాయి. బాలికలు, మహిళా గురుకులాల్లో పోస్టులన్నీ అతివలకే భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి.
Telangana Gurukul Notification : సంక్షేమ గురుకులాల్లో 9,231 పోస్టులకు ఈనెల 5వ తేదీన గురుకుల నియామక బోర్డు ఒకేసారి 9 ఉద్యోగ ప్రకటనలు వెల్లడించింది. ఇందులో 8 ప్రకటనలకు ఇప్పటికే సమగ్ర ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు నేటి నుంచి మే 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలుత టీజీటీ కింద 4,020 పోస్టులు ఉంటాయని ప్రకటించినప్పటికీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలోని 14 పోస్టులకు సర్వీసు నిబంధనలు రాకపోవడంతో అవి తాజా ప్రకటనలో చేర్చలేదు.
విద్యార్హతలు ఇలా..: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు జనరల్ అభ్యర్థులకు బీఎస్సీ, బీకాం, బీఏ డిగ్రీలో 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ ఉండాలి. లేదా డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా సంబంధిత లాంగ్వేజీ, ఓరియంటల్ లాంగ్వేజిలో డిగ్రీ, లిటరేచర్‌లో డిగ్రీ, వీటిల్లో సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50 శాతం మార్కులతో పాటు లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి. దీంతో పాటు సీటీఈటీ/టెట్-పేపర్-2 అర్హత ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం డిగ్రీ కోర్సుల్లో మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజులు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.600.. సాధారణ అభ్యర్థులు రూ.1,200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి.. రాతపరీక్ష మూడు పేపర్లుగా విభజించారు. మొత్తం 300 మార్కులకు ఉంటుంది.
మార్కులు ఇలా..: పేపర్-1లో 100 మార్కులకు ఆంగ్లభాష పరిజ్ఞానం, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్పై ఉంటుంది. పేపర్-2లో 100 మార్కులకు సబ్జెక్టు సంబంధించి బోధన సామర్థ్యాలపై ఉంటుంది. పేపర్-3లో 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై ఉంటుంది.
ఆగస్టులో రాత పరీక్షలు: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాలకు ఆగస్టులో రాతపరీక్షలు జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 9 ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు గడువు మేలో ముగియనుంది. ఆ తర్వాత 2 నెలల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర నియామక పరీక్షలు లేని రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది.
ఇవీ చదవండి: