TS Government Letters to the Center పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో సాంకేతిక బృందం ఏర్పాటు చేయాలని.. ఇందులో రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. వీటితో పాటు మరో 2 అంశాలపై రాష్ట్రప్రభుత్వం వేర్వేరు లేఖలు రాసింది.
ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు మూడు లేఖలు రాశారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మిస్తున్న పోలవరానికి సంబంధించి వివిధ సందర్భాల్లో తాము లేవనెత్తిన కీలక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం రాష్ట్రంలో గోదావరి నది రెండు వైపులా ఉంటుందని... స్టేక్ హోల్డర్స్ అందరితోనూ చర్చించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని రజత్ కుమార్ గుర్తు చేశారు. ఈ నెల 14వతేదీన జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.
ముంపు నష్టాన్ని మళ్లీ అంచనావేయాలి: ప్రాజెక్టు స్పిల్ వేను 50 లక్షల క్యూసెక్కుల నీటికి అనుగుణంగా డిజైన్ చేశారని, అదే జరిగితే తెలంగాణలో ముంపు చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు స్పిల్ వే డిశ్చార్జ్ కర్వ్స్, ఛానల్, ఫ్లడ్ రూటింగ్ కు సంబంధించిన వివరాలు అందించాలని కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు. పోలవరం కారణంగా తెలంగాణలో చారిత్రక భద్రచాల పట్టణం, పరిసరాల్లోని గ్రామాలు, మణుగూరు భారజల కర్మాగారం, భద్రాద్రి థర్మల్ ప్లాంటు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని... బ్యాక్ వాటర్స్ అధ్యయనం ద్వారా ప్రాబబుల్ మ్యాక్జిమమ్ ఫ్లడ్ ను సరిగ్గా అంచనా వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
బ్యాక్ వాటర్‌పై నష్టం ఎక్కువే: గోదావరి నదికి సంబంధించిన క్రాస్ సెక్షన్స్ విషయంలోనూ సర్వే చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావం గోదావరి నదితో పాటు స్థానికంగా ఉండే వాగులు, వంకలపైనా పడుతుందని, వీటి కారణంలో చాలా పంట పొలాలు, ఎత్తిపోతల పథకాలు, ఐటీసీ పార్కు, తదితరాలు కూడా ముంపునకు గురవుతాయన్న తెలంగాణ... ఎన్జీటీ తీర్పునకు అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఇదే సమయంలో అనుమతుల్లేకుండా బేసిన్ వెలుపలకు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న ఏపీ ఎత్తిపోతల పథకాల కోసం పోలవరంలో ఎక్కువకాలం ఎఫ్ఆర్ఎల్ కొనసాగించాల్సి వస్తుందని... తద్వారా ముంపు ఇంకా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా నిర్మాణాలను తక్షణమే ఆపివేయాలని కోరారు.
బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం అవసరం: ఇటీవలి గోదావరి వరదల కారణంగా ముంపును లేఖలో ప్రస్తావించిన తెలంగాణ... పోలవరంలో 150 అడుగుల ఎఫ్ఆర్ఎల్ ను కొనసాగిస్తే భద్రాచలం పట్టణంపై ముంపు ప్రభావం ప్రతి ఏటా ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆందోళన, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావంపై తటస్థసంస్థచే సమగ్ర అధ్యయనం చేయించాలని విజ్ఞప్తి చేసింది. గోదావరి నది తీరరాష్ట్రాలు, సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని, అందరికీ ఆమోదయోగ్యమైన సాంకేతిక పరిష్కారాన్ని రూపొందించాలని తెలంగాణ అభిప్రాయపడింది.
ఆలస్యం చేస్తే తెలంగాణకు నష్టం: అటు కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు కొత్త ప్రాజెక్టు కిందకు రావని గతంలోనే తాము వివరించామని... అనుమతుల్లేని ప్రాజెక్టు జాబితా నుంచి ఈ కాంపోనెంట్ తొలగించాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు రజత్ కుమార్ మరో లేఖలో పేర్కొన్నారు. పనులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న సీడబ్ల్యూసీ... అభిప్రాయాల కోసం గోదావరి బోర్డుకు రాస్తే ఇక్కడ అనవసర ఆలస్యం చేయడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పనుల విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తప్ప అనుమతుల విషయంలో కాదని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన ప్రక్రియను గోదావరి బోర్డు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఆలస్యమైతే తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ప్రాజెక్టులు ఆపేయాలి : మరోవైపు కర్నాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంతర్ రాష్ట్ర అంశాలను పట్టించుకోలేదని రజత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే ఈ ప్రాజెక్టులకు అనుమతుల అంశాన్ని కేంద్ర జలసంఘం పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో అంతర్ రాష్ట్ర అనుమతులు, ట్రైబ్యునల్ నివేదికలను పరిశీలించడం తప్పనిసరిని తెలంగాణ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది.
ఇవీ చదవండి: