రాష్ట్ర మంత్రివర్గం వరుసగా రెండో రోజు సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ అయింది. ఉద్యోగాల భర్తీ అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల కేటాయింపు పూర్తిచేసి ఖాళీలు గుర్తించి తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని నిన్నటి సమావేశంలో మంత్రివర్గం నిర్ణయించింది. పూర్తి వివరాలతో ఇవాళ్టి సమావేశానికి రావాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
కేడర్ వర్గీకరణ, ఉద్యోగుల కేటాయింపు, ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ నివేదిక సిద్ధం చేసింది. వాటన్నింటిపై కేబినెట్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఏపీతో కృష్ణా జలాల వివాదం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. న్యాయమైన నీటివాటాలకు తెలంగాణ విఘాతం కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.