Telangana Secretariat Getting Ready For New Government : శాసనసభ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వం మారుతోంది. గురువారం కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరనుంది. ప్రభుత్వ మార్పుతో ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదార్ల కార్యాలయాలు ఛాంబర్లు, పేషీలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా మంత్రులు, వారి కార్యదర్శులకు సంబంధించిన బోర్డులు తొలగించారు. మంత్రుల పేషీల్లోని దస్త్రాలు, ఇతరత్రాలను ఆయా శాఖలు, విభాగాలకు అప్పగిస్తున్నారు.
సీఎంఓ కార్యదర్శుల వద్ద ఉన్న దస్త్రాలను సంబంధిత శాఖలకు అప్పగిస్తున్నారు. కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని సాధారణ పరిపాలనాశాఖకు అప్పగిస్తున్నారు. అందులోని వ్యక్తిగత సామాన్లు, ఇతరత్రాలు తీసుకెళ్తున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు వ్యక్తిగత సహాయకులు దగ్గరుండి అన్నింటిని అప్పగిస్తున్నారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
Secretariat Ready For New Government : సచివాలయం నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, దస్త్రాలు తీసుకెళ్లకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు సిబ్బంది, పోలీసులకు ఆదేశాలివ్వడంతో వ్యక్తిగత సామాన్లు, ఇతరత్రాలను తీసుకెళ్తున్న సమయంలో అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఖాళీ అయిన ముఖ్యమంత్రి ఛాంబర్‌ను సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శేషాద్రి, ఇతర అధికారులతో కలిసి సీఎం గది, సమావేశ మందిరం, పేషీలను పరిశీలించారు. మంత్రివర్గ సమావేశ మందిరాన్ని పరిశీలించారు. అక్కడున్న ఫర్నీచర్, వసతులపై ఆరాతీశారు. ఇవాళ్టిలోగా అన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధంచేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా
Telangana CM Swearing Ceremony Arrangements : ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సీఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
అగ్నిమాపకయంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలని నిర్దేశించారు. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు, ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎమ్సి అధికారులను కోరారు. ఎల్బీస్టేడియం వద్దకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు. అన్ని సౌకర్యాలతో ఉన్న అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధనశాఖ అధికారులకు శాంతికుమారి సూచించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి రానున్న రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. కొత్త ముఖ్య మంత్రికి పోలీసులు గౌరవవందనం సమర్పించనున్నారు. ఇందుకోసం పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. కొండాపూర్ టీఎస్ఎస్పీ బెటాలియన్‌కు సంబంధించిన సిబ్బంది గౌరవ వందనం కోసం రిహార్సల్స్ చేశారు.
ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం - ఏర్పాట్లలో అధికారులు
కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్‌రెడ్డి ట్వీట్