TSRTC AC Sleeper Buses: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటి సారిగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఏసీ స్లీపర్ బస్సులను తీసుకువస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు జర్నీ మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ బస్సులను మొదటగా కొన్ని ప్రధాన మార్గాలలో అనగా కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా టీఎస్ఆర్టీసీ నామకరణం చేసింది. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనా ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు. రాష్ట్రంలో తొలిసారిగ అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎండీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బస్సు ప్రత్యేకతలు ఇవే : 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్తుల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్తు వద్ద రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు.
ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉంటాయి. కారులో మాదిరిగా ఈ బస్సును రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా రూపొందిస్తున్నారు. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి.
ఇవీ చదవండి: