TSRTC Single Day Income: తెలంగాణ ఆర్టీసీ రాబడిలో రికార్డులను తిరగరాసింది. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు కరోనా భయం పెద్దగా లేకపోవడం సంస్థకు కలిసివచ్చింది. ఆదాయం నుంచి ఆక్యుపెన్సీ వరకు అత్యధికంగా నమోదైంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం వచ్చే ఆదాయం ఒకింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సోమవారం(నవంబరు 22) రికార్డుస్థాయిలో రూ.14.06 కోట్లు లభించింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధికం (TSRTC Collect Huge Income) కావటం విశేషం.
2019 డిసెంబరులో ఛార్జీలు పెంచిన తరువాత ఒక రోజు ఇంత భారీగా ఆదాయం రావటం ఇదే తొలిసారి అని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఛార్జీల పెంపుతో రోజువారీగా రూ.13 కోట్ల వరకు ఆదాయం (TSRTC Revenue) వస్తుందని వారు అంచనా వేశారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ స్థాయిలో వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 23న రూ.13.03 కోట్లు లభించింది. ఏడాది మొత్తంలో అదే అత్యధికం. దాన్ని సోమవారం నాటి ఆదాయం అధిగమించింది.
36.10 లక్షల మంది ప్రయాణం
సోమవారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా 36.10 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ నెలలో ఇదే అత్యధికం. ఈ నెల 1న(సోమవారం) 33.16 లక్షల మంది ప్రయాణించారు. సోమవారం 77.06% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సగటు ఆక్యుపెన్సీ 66.25 శాతమే. గడిచిన ఏడాది ఇదే తేదీ నాటికి అది 54.43 శాతంగా ఉంది.
ఛార్జీలు పెంచే దిశగా..
గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే… పెరిగిన డీజీల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం కూడా అభిప్రాయపడుతుంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు (TSRTC Revenue) పెంచితే… ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టీసీ తిరిగి గాడినపడే అవకాశాలున్నట్లు అధికారులు ఆకాంక్షిస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై అధికారులు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు రూ.25 పైసలు, ఎక్స్‌ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటర్‌కు రూ.30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఆపై సర్వీసులకు రూ.30పైసలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: డ్రైవరన్నకు హాట్సాఫ్.. ప్రాణం మీదికొచ్చినా ప్రయాణికుల క్షేమం ఆలోచించి..
టీఎస్ఆర్టీసీకి అవసరమా..? పీకల్లోతు నష్టాలున్నా ఈ అనవసర ఖర్చులేంటో..?
TSRTC BUS Charges Hike: ఆర్టీసీ ఛార్జీల పెంపు దస్త్రం సీఎం కార్యాలయానికి!