రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసిన రిజిస్ట్రేషన్లను తక్షణమే ప్రారంభించాలని... తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్, బిల్డర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్స్ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ముందు సభ్యులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేయగా... ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం... కొత్త సమస్యల్ని సృష్టించడం ఎంత వరకు సమంజసమన్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం చట్టవిరుద్ధం, ప్రజా వ్యతిరేకమన్నారు. రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీతో పాటే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేస్తే ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు... పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.