Big Alert to Telangana Ration Card Holders : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు, రేషన్ సరకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రేషన్ కార్డుల్లో నమోదైన సభ్యులు ఎంత మంది ఉన్నారో.. వారందరికీ ఇప్పటికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ.. వాస్తవంగా చూసుకుంటే.. గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యులు చనిపోయారు. అమ్మాయిలు వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. కుమారులు పెళ్లి చేసుకొని కొత్త కుటుంబంగా ఏర్పడ్డారు. ఉద్యోగం, ఉపాధి పేరిట ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల పేర్ల మీద ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతోంది. దీంతో.. ప్రజాపంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు 'కేవైసీ' పేరిట రేషన్ కార్డుల వెరిఫికేషన్‌కు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇంతకీ కేవైసీ అంటే ఏమిటి? దానిని ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
KYC Registration Process in Telugu : ఇప్పటి వరకు రేషన్‌కార్డు కలిగిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేసి బియ్యం తీసుకునేవారు. అయితే తెలంగాణ సర్కార్ తాజా నిర్ణయంతో రేషన్ కార్డు(Ration Card) కలిగిన ప్రతి కుటుంబంలో ఎవరెవరున్నారనే విషయం తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులు రేషన్ దుకాణానికి వచ్చి 'నో యువర్ కస్టమర్'(కేవైసీ) పేరిట వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి కార్డుకు సంబంధించిన మృతుల వివరాలు తొలగిపోతాయి. దాంతో సరకుల కోటా, బియ్యం పంపిణీ కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ఈ మధ్యనే ప్రారంభమైంది. పూర్తయిన తర్వాత వాస్తవ సభ్యుల వివరాలను ఇకపై అధికారులు అంతర్జాలంలో నిక్షిప్తం చేయనున్నారు.
రేషన్ షాపుల్లో కేవైసీని ఎలా నమోదు చేసుకోవాలంటే..
How to Register KYC at Ration Shops in Telangana : రేషన్‌కార్డు పేరు ఉన్న కుటుంబ యజమానితో పాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీప చౌకధరల దుకాణానికి వెళ్లి 'ఈ-పాస్' యంత్రంలో మరోసారి వేలిముద్రలు వేయాలి. అక్కడ మీరు వేలి ముద్ర వేయగానే రేషన్‌కార్డు నెంబరుతో పాటు కార్డు సభ్యుల ఆధార్‌కార్డు నెంబరు చూపిస్తుంది. వీటిని సరి చూసిన తరువాత ఆ మిషన్‌లో ఆకుపచ్చ రంగు వెలిగి సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది.
ఎవరు వెళ్లకపోతే వారి రేషన్ కట్ : రేషన్‌కార్డులో ఎంతమంది పేర్లు ఉంటాయో వారంతా ఒకేసారి కేవైసీ కోసం.. చౌకధరల దుకాణానికి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ కుటుంబంలో ఆరుగురు సభ్యులు(యూనిట్లు) ఉంటే.. అందరూ కేవైసీకి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా వెళ్లకపోతే.. వారు అందుబాటులో ఉండట్లేదని గుర్తించి.. రేషన్ జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు. అప్పుడు వారికి రేషన్ అందదు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ దుకాణాలకు వెళ్లి మీ కేవైసీని అప్డేట్ చేసుకొని రేషన్ సరుకులను పొందండి.
దూర ప్రాంతాల్లో ఉన్న వారి సంగతేంటి? : కేవైసీ నిబంధనతో.. దూర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఉన్న రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. వేలిముద్రల కోసం వారిని రప్పించడం అనుకున్నంత సులభం కాదంటున్నారు. అందుకే.. సర్కార్ ఇలాంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.