రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో ఆరు ఎమ్మెల్సీల స్థానాలను అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటెడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలుండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఖాళీ అయ్యింది. మిగిలిన 119లో తెరాసకు 104, మజ్లిస్ 7, కాంగ్రెస్ 6, భాజపాకు 2 ఉన్నాయి. హుజూరాబాద్ ఫలితం నవంబరు రెండో తేదీన వెలువడుతుంది. ప్రస్తుత బలం ప్రాతిపదికన తెరాసనే మొత్తం ఆరు స్థానాలను పొందే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్దఎత్తున పోటీ ఉంది. పదవీకాలం ముగిసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి మరోసారి అవకాశం కోరుతున్నారు. ప్రస్తుతం శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం జనవరి నాలుగో తేదీన ముగుస్తుంది. గుత్తా లేదా కడియంలలో ఒకరిని శాసనమండలి ఛైర్మన్ పదవికి పరిగణనలోకి తీసుకునే వీలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా కోటా, ప్రధాన సామాజికవర్గం కోటాలో ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, మైనారిటీల కోటాలో ఫరీదుద్దీన్, మరోసారి ఎంపిక చేయాలని బోడకుంటి వెంకటేశ్వర్లు కోరుతున్నారు. తెరాస ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఉత్తర భారతీయుల కోటాలో పార్టీ సీనియర్ నేత నందకిశోర్ వ్యాస్ బిలాల్, మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. వివిధ ఎన్నికలు, పార్టీలో చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్ పలువురికి హామీ ఇచ్చారు. వివిధ సమీకరణాలపై చర్చ జరిగింది. బలమైన బీసీ ఉద్యమ నేత పేరు సైతం ప్రచారంలో ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సమర్థంగా పనిచేసిన వారినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హుజూరాబాద్ ఫలితం వెలువడిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై సీఎం దృష్టి సారించనున్నారు.
డిసెంబరులో 12 స్థానాలకు ఎన్నికలు
శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటాలో ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే జనవరి 4 నాటికి ముగియనుంది. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, సభ్యులు శంభీపూర్ రాజు, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, తేరా చిన్నపరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీష్‌కుమార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పట్నం మహేందర్‌రెడ్డిల పదవీకాలం సైతం వచ్చే జనవరి 4న ముగియనుంది. వీటికి నాలుగు వారాల ముందు అంటే డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు వెలువడాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే, అదే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలను సైతం సీఎం పరిగణనలోకి తీసుకొని శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీల ఎంపికకు అవకాశం ఉంది.