Telangana Ranks 3rd in Food Grains Production: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 1970-71 నాటి దిగుబడులతో 2019-20 నాటివి పోల్చి నాబార్డు రాష్ట్రాల వారీగా ర్యాంకులు ఇచ్చింది. తెలంగాణ 3వ స్థానంలో ఉండగా పంజాబ్, హరియాణాలు వరుసగా 1,2 స్థానాల్లో నిలిచాయి. ఏపీ ఆరో స్థానంలో ఉంది.
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత వ్యవసాయ రంగం ప్రయాణం’ అనే పేరుతో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెరుగుదల తదితర అంశాలపై పరిశోధించి నివేదికను ‘జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు’(నాబార్డు) తాజాగా విడుదల చేసింది. దేశంలో రాష్ట్రాల వారీగా ఆహారధాన్యాల హెక్టారుకు సగటు ఉత్పాదకతలో తెలుగు రాష్ట్రాలు వృద్ధిని సాధించాయి.
1970-71లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఉన్నప్పటికీ తెలంగాణ, ఏపీలకు విడివిడిగా 23వ ర్యాంకును నాబార్డు నివేదికలో ప్రకటించింది. అప్పటితో పోలిస్తే. 2019-20 నాటికి తెలంగాణ 3, ఏపీ 6వ స్థానానికి చేరాయని తెలిపింది. 1970-2020 మధ్య పంజాబ్ అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా అప్పుడు 2, 3 స్థానాల్లో ఉన్న కేరళ, తమిళనాడు కిందకు దిగాయి. హెక్టారుకు సగటున 4,527 కిలోల ఆహార ధాన్యాల దిగుబడి వస్తుంటే అందులో 77 శాతం తెలంగాణ సాధించినట్లు నాబార్డు వివరించింది.
పెరగని రైతు ఆదాయం: రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించినా ఆ కల నెరవేరడానికి అవసరమైనంత ఆదాయ వృద్ధి రేటు లేదని నాబార్డు తెలిపింది. రైతు కుటుంబ నెలవారీ సగటు ఆదాయం 2012-13లో రూ.6,426 ఉంటే 2018-19 నాటికి రూ.10,084కి చేరింది. కానీ వారి ఆదాయం వార్షిక వృద్ధి రేటు 2.5 శాతమే ఉంటోంది. ఇంత స్వల్పంగా వృద్ధి రేటు రైతుల ఆదాయం రెట్టింపు కావాలనే కల తీరడానికి సరిపోదని పేర్కొంది.
రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.10,084 ఉన్నట్లు కనిపించినా రైతుకున్న భూమి విస్తీర్ణాన్ని బట్టి లోతుగా పరిశీలిస్తే తక్కువ భూమి ఉన్నవారి ఆదాయం మరింత తక్కువగా ఉంది. ఎక్కువ విస్తీర్ణం భూమి కలిగిన పెద్ద రైతులకు వచ్చే ఆదాయంలో 91 శాతం పంటల ద్వారానే లభిస్తుండగా, తక్కువ భూమి కలిగిన రైతు కుటుంబ ఆదాయంలో పంటలపై వస్తున్నది కేవలం 28 శాతమేనని తేలింది.
పాడి పశువుల పెంపకంపై వచ్చే సొమ్ము రైతు కుటుంబ ఆదాయంలో 2002-03లో 4 శాతముంటే 2018-19 కల్లా 16 శాతానికి పెరగడం విశేషం. వ్యవసాయరంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విషయంలో ఏపీ రూ.3,15,000, తమిళనాడు రూ.2,90,000 విలువైన పంటలతో 2, 3 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రూ.1,81,000తో 16వ స్థానంలో నిలిచింది.
ఇవీ చదవండి: