ఏడాదిగా నగరంలో నేపాలు, బిహార్ ముఠాల చోరీలు పెరిగిపోతున్నాయి. పనివాళ్లుగా ఇళ్లలో చేరి అమాయకులుగా నటిస్తూ.. నమ్మకం కుదిరాక ఇంటిని కొల్లగొడుతున్నారు. యజమాని ఇళ్లు వదిలి బయటికి వెళ్లినప్పుడో... అదును చూసుకునో.. ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి మరీ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీరి ఆటకట్టించేందుకు పోలీసులు హాక్ఐ అప్లికేషన్‌ను తీసుకొచ్చారు. 2014 డిసెంబర్లో దీనిని ప్రారంభించారు.
ఇవీ ఉదంతాలు..
నాచారం ఠాణా పరిధి హెచ్ఎంటీ నగర్లో అక్టోబరు 19న చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులు... అదును చూసి లూటీ చేశారు. మరో నలుగురితో కలిసి బీరువా, అల్మారా పగలగొట్టి 18తులాల బంగారం, 40తులాల వెండి, 10లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రాయదుర్గం పీఎస్ పరిధిలోనూ నెల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో వాళ్లకు మత్తు మందు ఇచ్చి 15లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. సైనిక్ పూరిలోనూ ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో 8 నెలల క్రితం నేపాల్ ముఠా చోరీకి పాల్పడింది. కుమారుడి పెళ్లి వేడుకకు అందరూ వెళ్లగా... నేపాల్ ముఠా దాదాపు 2కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. రాజేంద్రనగర్ వృద్ధ దంపతులకు మత్తు పదార్థం ఇచ్చి సుమారు ఐదు లక్షలు అపహరించారు.
సరహద్దు దాటారో చిక్కరు
చోరీ చేసిన తరువాత సొత్తును పంచుకుని ఎవరికి వాళ్లే విడిపోయి నేపాల్‌కు వెళ్లిపోతున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్లినా ఒకరిద్దరే దొరుకుతున్నారు. నేపాల్ చట్టాల ప్రకారం నేరస్థులను తీసుకురావడానికి వీలులేదు. కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న పోలీసులకు అప్పజెప్పి వస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ ముఠాలు ఇదే తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు.
మహిళలకు భద్రమే..
నేపాల్, బిహార్‌కు చెందిన వారిని పనిలో కుదిర్చేందుకు పలు ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్లు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం లేదు. అందుకోసమే పోలీసులు హాక్ఐ అప్లికేషన్‌ను తీసుకొచ్చారు. మొదట హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉండేది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరించారు. ఈ అప్లికేషన్లో 31 విభాగాలకు చెందిన వ్యక్తుల వివరాలు నమోదు చేయవచ్చు. స్థానిక ఠాణాకు చెందిన గస్తీ వాహనం పోలీసులు ఇంటికి వచ్చి పనివాళ్లు, అద్దెకుండే వాళ్ల వివరాలు సేకరిస్తారు. మహిళలకు కూడా హాక్ఐ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడనుంది. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు చరవాణిలోని హాక్ఐ అప్లికేషన్లో ఎర్రమీట నొక్కగానే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సందేశం వెళ్తుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే దాదాపు 5వేల మంది హాక్ఐ అప్లికేషన్ ఉపయోగించుకొని పనివాళ్లు, అద్దెకుండే వాళ్ల వివరాలు తెలుసుకున్నారు.
చోరీ, నేరం జరిగిన తర్వాత బాధపడే దానికంటే... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. హాక్ఐ అప్లికేషన్ ఉపయోగించుకోవడంతో పాటు... పోలీసుల సూచనల పాటిస్తే.. చోరీలు నివారించొచ్చని చెబుతున్నారు.
ఇదీ చూడండి: అధిక వడ్డీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. ముగ్గురు అరెస్ట్