తెలంగాణ(TELANGANA) అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర సర్కారు, నీతి ఆయోగ్(NITI AAYOG) విడుదల చేసిన "అర్త్ నీతి(ARTH NITI)" నివేదికలో ప్రతిబింబింపజేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(VINOD KUMAR) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్.. తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించిందని వినోద్ తెలిపారు. ఈ ఏడేళ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం శరవేగంగా దూసుకువెళ్తోందని... అందుకు నీతి ఆయోగ్ "అర్త్ నీతి" నివేదికే నిదర్శనమని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయంగా విమర్శలు చేయడం మానుకొని... వాస్తవాలను గ్రహించి మెలగాలని హితవు పలికారు.
సీఎం కేసీఆర్ కృషితో..
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అహర్నిశలు కృషి చేస్తున్నారని... ఆ ప్రగతి ఫలితమే నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్ఫుటమైందని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీ(GSDP) 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,05,849 కోట్లు ఉండగా... 2020-21లో రూ. 9,80,407 కోట్లకు చేరుకోవడం ద్వారా వృద్ధి రేటు 94 శాతం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర వార్షిక వృద్ధి 2015-16 నుంచి ఇప్పటి వరకు 11.7 శాతం కంటే ఎన్నడూ తగ్గలేదని వెల్లడించారు.
వ్యవసాయంలో భేష్
వ్యవసాయ రంగంలో 54 శాతం మంది పాలుపంచుకుంటున్నారని... ఈ ఏడేళ్లలో 2 శాతం ఉన్న వ్యవసాయం ప్రస్తుతం 16.5 శాతం పెరిగిందని చెప్పారు. సీఎం దూరదృష్టితోనే కాళేశ్వరం, మిడ్‌మానేరు వంటి ప్రాజెక్టుల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. నీటి పారుదల రంగంలో గణనీయమైన ప్రగతితో వ్యవసాయం పెరిగిందని వినోద్ స్పష్టం చేశారు. తలసరి ఆదాయం దాదాపు రెండింతలైందని వివరించారు. 2014-15లో తలసరి ఆదాయం రూ. లక్షా 24 వేల 104 ఉండగా 2020-21లో అది రూ. 2 లక్షల 37వేల 632కు పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందని వినోద్ కుమార్ వివరించారు.
ఇదీ చదవండి: Harish Rao: 'బొట్టు బిళ్లలకు, గడియారాలకు ఓటేస్తారా... అభివృద్ధికి ఓటేస్తారా..?'