రాష్ట్రంలోని 53 పురపాలికలు, 3 కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం... వచ్చే నెల రెండో తేదీతో పూర్తి కానుంది. అయితే ఎన్నికలు జరగనందున ఆలోగా కొత్త పాలకమండళ్లు కొలువుతీరే అవకాశం లేదు. ప్రత్యేకాధికారుల నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారుల నియామకానికి సంబంధించి జులై రెండో తేదీన ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు జులై నెలలో పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం ప్రకటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఓటర్ల గుర్తింపు చేపట్టారు.
ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో... ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తుండగా.. అన్ని చోట్లా బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. 28 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
18న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటన
ఇందులో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీ లోపు లోక్ సభ ఎన్నికల ఓటర్ జాబితాల ఆధారంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు పూర్తి చేయాలి. ఐదో తేదీతో ఓటర్ జాబితాలు సిద్ధం చేసి ఆరున ముసాయిదా ప్రకటించాల్సి ఉంటుంది. ముసాయిదాపై 11 వరకు అభ్యంతరాలు స్వీకరించాలి. జులై 16 వరకు అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలి. 17న ఓటర్ల జాబితా, 18న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటించాలి. ఓటర్ల జాబితా పురపాలక శాఖ సంచాలకుడికి 19న పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపడతారు.
ఇవీ చూడండి: వేములవాడలో వరుణ యాగం
వచ్చే నెల 19 నాటికి ముగియనున్న గుర్తింపు ప్రక్రియ
ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. నూతన పురపాలక చట్టాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో అందుకు అనుగుణంగా పురపోరు జరగనుంది. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా పురపాలక శాఖ కసరత్తు పూర్తి చేస్తోంది.
ఇవీ చూడండి: సిరిసిల్లను తిరువూరు తరహాలో అభివృద్ధి చేస్తా: కేటీఆర్