Telangana Monsoon Assembly Sessions 2022: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు సంతాపం తెలిపి.. ఈ నెల 12, 13వ తేదీలకు సభలను వాయిదా వేశారు. తిరిగి నిన్న ప్రారంభమైన సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి.. వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మూడో రోజైన నేడూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అనంతరం శాసనసభలో 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 8 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందన్న మంత్రి... రాష్ట్రం ఆయనకు రుణపడి ఉంటుందని వివరించారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును తలసాని ప్రవేశపెట్టగా... జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.
అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్ట సవరణ బిల్లు, డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లును శాసనసభ ఆమోదించింది. అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. 25 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేలా ప్రత్యేక నిబంధన పెట్టినట్లు వెల్లడించారు. వీటన్నింటికీ సభ్యులు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ వద్ద హైటెన్షన్..: అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, టీచర్ల సంఘాల ప్రతినిధులు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరగా.. ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఒక్కసారిగా సంఘాల నేతలు అసెంబ్లీ వైపునకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పే స్కేల్ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేయగా.. మంత్రి కేటీఆర్ వారితో సమావేశమై.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి..
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్.. ముట్టడికి పలు సంఘాల యత్నం
ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు: కిషన్‌రెడ్డి