పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జీవాలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రపంచ రేబిస్ డే సందర్భంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో వీధి కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీకి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు.
రాష్ట్ర ఎనిమల్ బోర్డ్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలోనే జిల్లా ఎనిమల్ బోర్డ్ కమిటీల పునరుద్దరణకు చర్యలు చేపడతామని ప్రకటించారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంచార పశువైద్య శాలలు జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. లాక్డౌన్ ఆంక్షల సమయంలో వీధి శునకాలకు ఆహారం అందించిన సంస్థల నిర్వాహకులను తలసాని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈఓ డాక్టర్ మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు, పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.