Minister Prashanth Reddy Review on Secretariat : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్ర వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయ నిర్మాణం, అంతర్గత సుందరీకరణ, ఫర్నీచర్ డిజైన్స్ ఉంటాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్‌లు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నూతన సచివాలయంలోని ఫర్నీచర్, ఇంటీరియర్లకు సంబంధించిన క్లాసికల్, సెమీక్లాసికల్, మోడ్రన్ డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు.
రాష్ట్ర వైభవానికి ప్రతీకగా..
Telangana New Secretariat : ఇంటీరియర్‌కు సంబంధించి ఆర్కిటెక్ట్‌లు తయారు చేసిన డిజైన్లు, పలు ఫర్నీచర్ డిజైన్లను మంత్రి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఇంటీరియర్‌లో మౌల్డింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్ పనులు, రంగుల కూర్పు వాటికి క్లాసికల్, సెమీ క్లాసికల్, మోడ్రన్ ప్యాట్రన్లలో డిజైన్లు తయారు చేసి సమర్పించాలని ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నమూనాలు ఖరారు చేయాలని చెప్పారు.
New Secretariat in Telangana : సచివాలయ సిబ్బంది కోసం వర్కింగ్ స్టేషన్ నమూనాలు, కార్యదర్శుల ఛాంబర్లు, మంత్రుల చాంబర్లలో ఏర్పాటు చేసే ఫర్నీచర్ల నమూనాలూ పరిశీలించి వాటిలో మూడు రకాలను ఎంపిక చేస్తామని.. సీఎం కేసీఆర్ వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం సీఎం పేషీ, వీవీఐపీ వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, రెండు స్కై లాంజ్‌లు, క్యాబినెట్ హాల్ నమూనాలు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండేలా చూడాలని ఆర్కిటెక్‌లకు సూచించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా ఏకకాలంలో చేస్తూ ముఖ్యమంత్రి నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.