Incentives in Telangana Milling Industry : తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక, రైతు అనుకూల విధానాలతో సాధించిన పదిరెట్ల ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ ఇండస్ట్రీ సామర్థ్యం పెంపు, ఆధునీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న ధాన్యం, మిల్లింగ్ సామర్ధ్యం పెంపు, మిల్లుల ఆధునీకరణ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవండంలో ఇబ్బందులు, సులభతర మార్గాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. 2014లో 1815 రైస్ మిల్లులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 2574కు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో ఏటా 3 కోట్ల టన్నులు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యం మిల్లింగ్ చేయడానికి తెలంగాణలో విసృత అవకాశాలు ఉన్నాయి.
Opportunities For Investors in Milling Industry : పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రూ.2000 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఒడిసిపట్టడంలో తెలంగాణ ముందుంటుంది. అదేరీతిన మిల్లింగ్ ఇండస్ట్రీలో సైతం అత్యాదునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఎప్పటికప్పుడు పంటలకు మరింత మద్ధతు అందించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Telangana mills Modernization : ధాన్యం మిల్లింగ్‌తో పాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక, తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న సటాకే, సైలో తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా సటాకే కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం మంత్రి గంగుల కమాలాకర్కు వివరించారు. గంటకు 20 నుంచి 1200 టన్నుల మిల్లింగ్ సామర్ధ్యం తమ సొంతమని పేర్కొన్న ప్రతినిధులు.. బాయిల్డ్, రా రైస్ దేనికైనా అనుగుణంగా అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యర్థం, వ్యయం తగ్గేలా టెక్నాలజీ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం మిల్లులు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన యాజమాన్యాలకు టేలర్ మేడ్ ఇన్సెంటీవ్స్ ప్రభుత్వం అందించనుంది. ఈ జోన్లలో సాధారణ పెట్టుబడిదారులకు సైతం 5 ఏళ్ల పాటు రూ.2కే యూనిట్ నాణ్యమైన కరెంట్, 75 శాతం వరకూ వడ్డీ మాఫీ, మార్కెట్ ఫీజుల్లో 100 శాతం రాయితీలు అందించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తుంచనున్న దృష్ట్యా.. ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అమెరికా, చైనా, థాయిలాండ్ తదితర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఉన్న విసృత అవకాశాలతో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉండడంతో సటాకే కార్పొరేషన్ తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ కంపెనీ ప్రతినిధులతో అన్ని అంశాలు కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల.. త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి సమర్పిస్తామని వెల్లడించారు.
రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు మొదలు అవి అన్నార్థులకు అందించే పంపిణీ వరకూ.. వివిధ దశల్లో ఎలాంటి వృధా లేకుండా చేయాలని సర్కారు నిర్ణయించింది. మరింత సామర్ధ్యం పెరిగేలా టెక్నాలజీ అప్ గ్రేడేషన్‌పై నెట్వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న పలు బహుళ జాతి సంస్థలు ముందుకు రావడం శుభపరిణామం.
ఇవీ చదవండి: