రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ(telangana state press academy) ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి సహాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు కొవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు.. జులై 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కరోనా మృతుల కుటుంబాలకు గతంలో మాదిరిగానే ఐదేళ్ల పాటు నెలకు రూ. 3 వేల పింఛను లభిస్తుందని నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా వారి కుటుంబాల్లో 10వ తరగతిలోపు చదువుకుంటున్న పిల్లల్లో గరిష్ఠంగా ఇద్దరికి రూ. 1000 చొప్పున ఉపకార వేతనం అందిస్తామని ఆయన ప్రకటించారు.
దరఖాస్తు చేయాలంటే
అర్హులు దరఖాస్తుతోపాటు పాత్రికేయుడి అక్రిడిటేషన్, ఐడీ, ఆధార్ కార్డులు, రూ. 2 లక్షలలోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, బ్యాంకు పాసు పుస్తకం, 3 ఫొటోలు, జిల్లా వైద్యాధికారి నిర్ధరించిన కొవిడ్ మరణ ధృవీకరణ పత్రాలను జత చేయాలని ఛైర్మన్ సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా లేదా పోస్ట్ ద్వారా పంపించాలని వివరించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన కుటుంబాలు.. ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపిన సభ్యులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
చిరునామా
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు..
కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి నంబరు 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపించాలని తెలియజేశారు. ఇతర వివరాలకు 7702526489 నంబరును సంప్రదించాలని అల్లం నారాయణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: High Court: 'అధికారుల వేతనాలు ఆ దంపతులకు ఇస్తే మేలు'