ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తార్నాక డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, మానికేశ్వర్ నగర్, ఓయూ క్యాంపస్, తార్నాక బిగ్ బజార్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించి బాధితులకు వరద సాయం పంపిణీ చేశారు.
బాధితులందరికీ ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా లభించేలా ఏర్పాట్లు చేశామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల ఇళ్లకే అధికారుల బృందాలు వచ్చి సహాయం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి రూ. 550 కోట్లు విడుదల చేశారని... అవసరమైతే మరో వంద కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అలకుంట సరస్వతి, కిషోర్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'మీరు రాజీనామా చేస్తామంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం'