KTR Met Tamilnadu IT Minister Palanivel Thaigarajan: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ ఆధ్వర్యంలో ఒక బృందం మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు ఐటీ మంత్రి పీటీఆర్ బృందం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళనాడు మంత్రి పీటీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రగతిపైన, అందుకు దోహదం చేసిన అంశాలపైన అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని తెలిపారు.
KTR on Telangana IT Development : ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ పాలసీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తమిళనాడు ఐటీ బృందానికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని... అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి రాష్ట్ర ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రభుత్వ విధానాలు, పాలసీలపై ప్రశంసలు కురిపించిన తమిళనాడు బృందం : ఐటీతో పాటు ఐటీ అనుబంధ రంగాలకు ప్రత్యేకంగా ఒక పాలసీని తయారు చేసిన విధానం గురించి తమిళనాడు బృందానికి కేటీఆర్ విస్తృతంగా వివరాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన విషయాలన్నింటి గురించి సావధానంగా తెలుసుకున్న తమిళనాడు మంత్రి పీటీఆర్ బృందం.. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పాలసీలపైన ప్రశంసలు కురిపించింది. నూతనంగా తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని తమిళ మంత్రి పీటీఆర్ వ్యక్తం చేశారు.
Global Trade and Innovation Policy Alliance 2023 : మరోవైపు బెర్లిన్‌లో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సైన్స్ అండ్ టెక్ పాలసీ కోసం ప్రపంచంలోని ప్రముఖ థింక్ ట్యాంక్ సంస్థ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయన్స్ 2023 వార్షిక సదస్సులో మంత్రి కేటిఆర్ కీలక ప్రజెంటేషన్‌ను అందించనున్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ సాధించిన విజయం ప్రస్తావించాలని.. గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఎజెల్ సంతకం చేసిన ఆహ్వాన లేఖలో మంత్రిని అభ్యర్థించారు.
ఇవీ చదవండి :