ఇంటర్ ద్వితీయ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం ముందుగా చేయాలని నిర్ణయించారు. మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 36 కు పెంచాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సూచించారు. మూల్యాంకనం చేసే ఎగ్జామినర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే అధ్యాపకుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులకు తెలిపారు. ఎంసెట్, జేఈఈ, నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ కోచింగ్, పరీక్షలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారులకు వివరించారు.
ఆన్లైన్ పరీక్షలకు మంచి స్పందన వస్తోందని.. ఏపీ, ఒడిశా, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 5,346, బైపీసీ విద్యార్థులు 2,354 మంది ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. ఆన్లైన్ కోచింగ్, పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన ఇంటర్ బోర్డును అభినందించిన విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి.. ఆసక్తి చూపే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల ఇంటర్ విద్యాధికారులు వీడియో సమీక్షకు హాజరయ్యారు.