సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తి అండగా ఉండటంతోపాటు.. ఇబ్బందుల్లో ఉన్న వాటికి ఆర్థిక, ఇతర సహకారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్‌ను ప్రారంభించింది. 2017లో ప్రారంభమైన ఈ క్లీనిక్ మూడేళ్లు పూర్తి చేసుకోంది. మూడేళ్ల ప్రగతికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఎంఎస్ఎంఈ రంగానికి అపూర్వమైన సేవలందిస్తున్నట్లు తెలిపింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజర్వ్ బ్యాంకు నుంచి 2018 జనవరిలో గుర్తింపు పొందిన క్లీనిక్... 2018 ఏప్రిల్ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది.
సుమారు 218 దరఖాస్తుల స్వీకరణ
ఎంఎస్ఎంఈలు రుణాలను కట్టలేక, డిఫాల్ట్ అయినప్పుడు, కొంత సమయం కోరిన సందర్భంలో బ్యాంకులు నేరుగా వాటిని ఎన్పీఏలుగా ప్రకటించే ఆనవాయితీ కొనసాగుతోంది. దీంతో అవన్నీ మూతపడే దిశగా వెళ్తున్నాయి. ఆ తరహా రుణగ్రస్త ఎంఎస్ఎంఈలను అదుకునేందుకు హెల్త్ క్లీనిక్ ప్రయత్నిస్తోంది. హెల్త్‌క్లీనిక్ ఇప్పటి వరకు సుమారు 218 దరఖాస్తులను స్వీకరించి అందులో 104 ఎంఎస్ఎంఈలనుపునరుద్ధరించేందుకు అవకాశం ఉన్నట్లుగా గుర్తించింది.
60 కంపెనీలు ఇప్పటికే తిరిగి కార్యకలాపాలు
ఇందులోంచి 60 కంపెనీలు ఇప్పటికే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి. సుమారు 28 ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారాన్ని కూడా అందించినట్లు క్లీనిక్ తెలిపింది. మరో 44 ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో సుమారు 95 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈ ఆస్తులను రక్షించటంతోపాటు 1800 మంది ఉద్యోగాలను కాపాడినట్లు వివరించింది. ప్రస్తుతం కేవలం పునరుద్ధరణ కోసం మాత్రమే పనిచేస్తున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్... తన పాత్రను, పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకొని ఎంఎస్ఎంఈలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే సంస్థగా మారేందుకు కృషి చేస్తోంది.
వ్యవసాయ విప్లవం నేపథ్యంలో
ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో ఎంఎస్ఎంఈలతో వెబినార్లు, సెమినార్ల వంటి కార్యక్రమాలు చేపట్టి అవగాహన కలిగిస్తోంది. రాష్ట్రంలో వస్తున్న అద్భుతమైన వ్యవసాయ విప్లవం నేపథ్యంలో వ్యవసాయ, పుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ఎంఎస్ఎంఈలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తోంది. చేనేత, పవర్‌లూమ్‌లోని ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ వంటి అంశాల్లో సహకరించి వాటి వృద్ధికి దోహదకారిగా నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ తెలిపింది.
ఇదీ చదవండి: 59 చైనా యాప్లపై నిషేధం