ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ వీసీ రమేశ్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 61,613 మంది విద్యార్థులు ఈ ఏడాది ఐసెట్‌లో అర్హత సాధించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్వర్దన్ మొదటి ర్యాంకు సాధించగా.. కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేశ్చంద్రరెడ్డి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయి మూడో ర్యాంకు సాధించారు.
రాష్ట్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాల్గో ర్యాంకు సాధించారు. ఈసారి 68,781 విద్యార్థులు పరీక్ష రాయగా.. 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వీసీ రమేశ్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు, 31,201 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని వివరించారు. ఫలితాలు https://icet.tsche.ac.inలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఐసెట్ ప్రిలిమినరీ కీని ఆగస్టు 4న విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి..:
ఆశీర్వాదం పేరుతో స్వామీజీ లైంగిక వేధింపులు, బాలికలను గదిలోకి పిలిచి
దేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మంచి భవిష్యత్తు ఉందన్న కిషన్‌రెడ్డి