సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందడంలేదన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా సమయంలో జీవనోపాధి లేక కోటి మందికి పైగా అసంఘటిత కార్మికులకు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనరసింహ పిల్ దాఖలు చేశారు.
చేనేత, జాలర్లు, కల్లుగీత కార్మికులు, తోలు పరిశ్రమ కార్మికులు, బీడీ కార్మికులు, భూమిలేనివారు, వీధి వ్యాపారులు, రోజువారీ వేతన కార్మికులు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు నష్టపోతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కార్యదర్శి, కమిషనర్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వార్డును పరిశీలించండి...
కరోనా సమయంలో ట్రాన్స్‌జెండర్లకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సమగ్ర వివరాలు లేకుండా మొక్కుబడిగా సమర్పించిన నివేదికను ఆమోదించజాలమని స్పష్టం చేసింది.
చౌకధరల దుకాణాల్లో ఉచితంగా రేషన్, కూరగాయలు, ఉచిత వైద్యం అందించేలా, ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా ఆదేశాలివ్వాలని వైజయంతి వసంత మొగిలి అలియాస్ ఎం.విజయ్‌కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కరోనా సమయంలో ప్రత్యేక వార్డు కేటాయించకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ రేషన్ దుకాణాల్లో సరకుల కేటాయింపునకు అనుమతించారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. థర్డ్ జెండర్ అన్న కారణంగా నిరాకరించడం తగదని తెలిపింది.
నివేదికలో 2,175 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని పేర్కొన్నారని, ఇది రాష్ట్రవ్యాప్త సంఖ్యా, హైదరాబాద్‌లోనిదా స్పష్టం చేయాలని సూచించింది. ఏం అడిగినా 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తున్నామంటూ చెబుతున్నారని పేర్కొంది. సామాజిక హోదాను పరిగణలోకి తీసుకుని వారికి టిమ్స్‌లో ప్రత్యేక వార్డును కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. 610 మంది విరాళాలు ఇచ్చారన్నారని... ఎంత మొత్తం, ఎందరికి సాయం ఇచ్చారో చెప్పలేదంది. మొత్తం వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలంటూ విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.