Registrations In Unauthorized Layouts: అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లనూ షరతులతో రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్రిజిస్ట్రార్లను ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా అనధికార లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ 2020 ఆగస్టు 26న రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను చేయవచ్చని.. కొత్త వాటిని మాత్రం చేయవద్దంటూ అదే ఏడాది డిసెంబరు 29న ఉత్తర్వులు సవరించారు.
రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై హైకోర్టులో సుమారు ఐదువేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. పరిస్థితి తీవ్రతను పరిగణలోకి తీసుకొని జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది. హైదరాదాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ స్థలం రిజిస్ట్రేషన్ నిలిపివేతపై గతేడాది జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం తీర్పునిచ్చింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం.. ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కనుక.. ధర్మాసనం తీర్పును హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. తాజాగా అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరినీ హైకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే...
సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని డాక్యుమెంట్లో మొదటి పేజీ వెనక పేర్కొనాలని సబ్ రిజిస్ట్రార్లకు సూచించింది. జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌తో పాటు కనీసం 30 అడుగుల రోడ్డు లేని ప్రాంతాల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసుకుంటే కొనుగోలుదారులదే బాధ్యత అని హెచ్చరించాలని రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించింది. డాక్యుమెంట్‌లోని రెండో పేజీ వెనక ఆ విషయాన్ని రాయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఎన్కంబరెన్స్, వెబ్సైట్లోనూ పొందుపరచాలని స్పష్టం చేసింది. సుమారు 5వేల పిటిషన్లపై విచారణ ముగించిన హైకోర్టు... ఈ ఉత్తర్వులు అన్నింటికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇదీచూడండి: అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు: యుద్ధభూమిపై విద్యార్థుల ఆవేదన