ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాల నమోదుపై సీఎస్ సోమేశ్ కుమార్ నివేదిక సమర్పించారు. ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేనివారికి ప్రత్యామ్నాయం ఉందని సీఎస్ తెలిపారు. ఈ అంశంపై ఐచ్ఛికంగా కూడా ఆధార్ వివరాలు ఎలా అడుగుతారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
స్లాట్ బుకింగ్ కోసం 29 పేజీల సమాచారం అడుగుతున్నారని పిటిషనర్ తెలిపారు. స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దని హైకోర్టు తెలిపింది. క్రయ, విక్రయదారులతోపాటు సాక్షుల ఆధార్ అడగటాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ప్రభుత్వం తప్పించుకునేందుకు తెలివిగా వ్యవహరిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం న్యాయస్థానంలో నిజాయతీగా ఉండాలని సూచించింది. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆదేశించడం తప్ప మరో మార్గం కనిపించట్లేదని హైకోర్టు వెల్లడించింది. ఆధార్, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించి వివరణ ఇస్తామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం... 18 లక్షల మేర ఆస్తినష్టం