వినాయక నిమజ్జనం సందర్భంగా అమలు చేయదగిన ఆంక్షలు, నియంత్రణ చర్యలను సూచించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యచరణ సమర్పించాలని అదేవిధంగా గణేష్ ఉత్సవసమితి, పిటిషనర్ కూడా నివేదికలు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
సూచనలు సరిపోవు...
కొవిడ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి, ప్రజలకు పలు సూచనలు చేసినట్లు పీసీబీ తరఫు న్యాయవాది తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50వేల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని.. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలో పలు చెరువులను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే సూచనలు సరిపోవని.. నిర్దుష్టమైన సూచనలు ఇస్తే తాము ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
అలా చేస్తే ప్రజాధనం వృథా
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానికంగా నిమజ్జనం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏడాది పొడవునా.. వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారని.. నిమజ్జనం సమయంలో వాటన్నింటినీ తొలగిస్తున్నారని.. దానివల్ల ప్రజాధనం వృథా అవుతోదందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందరి సూచనలను తమ ముందుంచితే.. వాటన్నింటినీ పరిశీలించి ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
ఇదీ చూడండి: భారత్‌లో 'దక్షిణాఫ్రికా' కరోనా వేరియంట్- నిజమెంత?