TS High Court on TSPSC Paper Leakage Issue : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్న హైకోర్టు.. పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు 3 వారాల సమయమిచ్చింది. పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది.
కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా... ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు హైకోర్టుకు వచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ కేసుపై సమగ్ర విచారణ జరపాలని ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా అన్నారు. ఇద్దరు నిందితులకే సంబంధం ఉందని ఐటీ మంత్రి చెప్పారన్న ఆయన.. కేసు మొదటి దశలోనే ఇద్దరికే ప్రమేయం ఉందని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దర్యాప్తు విషయంలో ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదన్నారు. వ్యాపమ్ స్కామ్ తీర్పు ప్రతిని వివేక్ ధన్కా హైకోర్టుకు సమర్పించారు.
'ఒకే మండలం నుంచి 20 మంది అధిక మార్కులు సాధించారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలి. గతంలో వ్యాపమ్ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చింది. గ్రూప్1 క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు. క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదు.'-వివేక్ ధన్కా, ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్
సిట్ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది : ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ ఇదని ఆయన వాదించారు. లీకేజీ కేసులో సిట్ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోందన్న ఏజీ.. ఇప్పటి వరకు లీకేజీ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషనర్లు కేవలం ఇద్దరే అరెస్ట్ అయ్యారని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. పేపర్ లీకేజీ కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
నాలుగో రోజు కొనసాగుతున్న సిట్ దర్యాప్తు : టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో నిందితుల విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా పేపర్ లీకేజీ కేసులో నిందితులను విచారణ కోసం... సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి పోలీసులు తీసుకెళ్లారు. నిందితులను ఆరు రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు... నిందితురాలు రేణుకతో పాటు ఆరుగురిని ముమ్మరంగా విచారిస్తున్నారు.
మరోవైపు నిందితుడు రాజశేఖర్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలోనూ సిట్ అధికారులు లీకేజీ వ్యవహారంపై విచారించనున్నట్లు సమాచారం. రాజశేఖర్ తన స్వగ్రామంలో సైతం కొందరికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు విదేశాల నుంచి వచ్చిన రాజశేఖర్ సన్నిహితులు అతని నుంచి తీసుకున్న ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షలు రాసినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై సిట్ దృష్టి సారించింది. అంతేకాకుండా మరో నిందితురాలు రేణుక తన స్వగ్రామంలో ఇదే విధంగా ప్రశ్నాపత్రాలు విక్రయించిందా? అనే కోణంలోనూ సిట్ అధికారులు విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: