రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంపై ఈనెల 24న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, గనినోళ్ళ శ్రీనివాస్ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. త్వరగా విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ప్రస్తావించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై హైకోర్టు ఎలా విచారణ చేపడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వం, కృష్ణా జలాల నిర్వహణ బోర్డు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని న్యాయవాది పేర్కొన్నారు.
టెండర్లు ఖరారు చేసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారన్నారని హైకోర్టుకు వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించిన వివాదాలపై విచారణ జరిపే అధికారం తెలంగాణ హైకోర్టుకు ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పిటిషన్ దాఖలు చేశారని ఏపీ తరఫు న్యాయవాది గోవింద్ రెడ్డి వాదించారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు లేదా ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: నోయిడా పవర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం