హైదరాబాద్లోని గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ నిర్వహణ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాలను పరిరక్షించే తీరు ఇదేనా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. గోల్కొండ, కుతుబ్ షాహీలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయని.. గతేడాది అక్టోబరులో పత్రికల్లో ప్రచురితమైన కథనం ఆధారంగా హైకోర్టు పిల్ స్వీకరించింది.
ఆ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. విద్యుత్ దీపాలు కూడా సరిగా లేవని వ్యాఖ్యానించింది. దేశ విదేశాల పర్యటకులు వచ్చే ప్రాంతాలను పట్టించుకోక పోవడం బాధాకరంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
చారిత్రక కట్టడాల నిర్వహణ, మరమ్మతులకు నిధులు ఎన్ని కేటాయించారు. పర్యటకుల నుంచి వచ్చే సందర్శన ఛార్జీలు ఎంత వసూలు చేశారు? తదితర వివరాలన్నీ రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. ఏప్రిల్ 15న విచారణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యటక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.
ఇదీ చూడండి : 140 ఎకరాల వివాదాస్పద భూమి ప్రభుత్వానిది కాదు: హైకోర్టు