High Court Hearing On Animal Slaughter On Bakrid : బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో గోవధ, జంతుసంరక్షణ చట్టం కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. బక్రీద్‌ను అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తూ నిజమైన స్ఫూర్తితో జరుపుకోవాలని ధర్మాసనం కోరింది. బక్రీద్ సందర్భంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఇష్టారీతిగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శివకుమార్ నిన్న రాసిన లేఖను సుమోటో పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. విచారణ జరిపిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం బక్రీద్ తేదీ ముందే తెలిసినప్పటికీ.. ఒక్క రోజు ముందు లేఖ రాసి చర్యలు తీసుకోమనడం తగదని హైకోర్టు పేర్కొంది.
చివరి నిమిషంలో వచ్చి ఇలాంటి సున్నితమైన అంశాల్లో హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది. కనీసం నెల రోజులు ముందే వస్తే తాము పర్యవేక్షించడానికి అవకాశం ఉండేదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గోవధ, పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. అందుకు గోవధ, అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ఏజీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. అలాగే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. అక్రమంగా గోవులను రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఏజీ కోర్టుకు వివరించారు.
Telangana High Court Guidelines For Animal Slaughter : అందుకు హైకోర్టు స్పందిస్తూ.. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గోవధ జరగకుండా తగిన చర్యలను తీసుకోవాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే దీనిపై ఎంత వరకు చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ.. ఆగస్టు 2న నివేదికలు ఇవ్వాలని సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజినీ కుమార్‌లకు హైకోర్టు తెలిపింది. జంతు వధ, మాంసం దుకాణాల్లో ఎన్ని అనుమతి ఉన్నవి.. లేనివి ఎన్ని ఉన్నాయనే వాటిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జంతు వధలను ప్రభుత్వమే నిర్వహిస్తోందా.. లేకపోతే జీహెచ్ఎంసీ అనుమతులు ఇస్తుందా అనే దానిపై వివరణ అడిగినట్లు సమాచారం.
జంతువధపై గతంలో హైకోర్టు తీర్పు : గతంలో కూడా జంతువుల అక్రమ వధను జరగకుండా చూడాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ అలాంటి దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఒంటెలు, ఇతర జంతువుల అక్రమ రవాణా వంటివి చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ అలాంటి చర్యలు ఏవీ కనిపించలేదు.
2020లో ఒంటెల అక్రమ రవాణా, అక్రమ వధ నిరోధించాలని కోరుతూ.. వైద్యురాలు శశికళ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది. అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి.. నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేశారు.
ఇవీ చదవండి :