Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది ‘కీ’ విడుదలైంది. పేపర్-1 జనరల్ స్టడీస్‌లో ఏడు ప్రశ్నలు తొలగించగా.. మరో ఎనిమిదింటికి ఆప్షన్ మార్చారు. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించగా.. అయిదింటికి సమాధానాలు మార్చారు. ఆగస్టు 28న ప్రాథమిక 'కీ' విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో తుది 'కీ' విడుదల చేశారు.
TS Group-4 Exam 2023 Final Key : రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 పరీక్షకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా .. 7 లక్షల 60వేల మంది రాశారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.
- గ్రూప్-4 పేపర్-1 జనరల్ స్టడీస్ ఫైనల్ "కీ"
- గ్రూప్-4 పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఫైనల్ "కీ"
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1 జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 పరీక్షకు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడ్డారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు.