భారత్‌లో తయారైన కొవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూడటం ఎంతో గర్వకారణంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపడం మన దేశ శాస్త్రవేత్తల సత్తాను మరోసారి నిరూపించిందన్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్య కళాశాల పాథాలజీ విభాగం వార్షికోత్సవాల్లో భాగంగా ఏడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై శాస్త్రవేత్తలతో సమీక్షించిన గవర్నర్... దేశాభివృద్ధిని విమర్శించే వారికి వ్యాక్సిన్ తయారీ సమాధానమిచ్చిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వ పనితీరుకు, విశాల దృక్పథానికి ఇది నిదర్శనమని కొనియాడారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు. సూక్ష్మజీవ ప్రపంచంలో పరిశోధనలకు కృతిమమేథలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడవడం మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. చికిత్సలో పాథాలజీ నివేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.
కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జే.ఎ. జయలాల్, శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ విజయరాఘవన్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...