Governor Approved Three Pending Bills: పెండింగ్ బిల్లుల విషయంలో గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉభయసభల్లో ఆమోదం పొంది.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. మరో మూడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు.
విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లుతో పాటు అటవీ విశ్వవిద్యాలయం బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల్లో.. మూడింటికి మాత్రమే ఆమోదముద్ర వేశారు. మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లు, పురపాలకచట్ట సవరణ బిల్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులను గవర్నర్ ఆమోదించారు. రెండు బిల్లులపై అభిప్రాయం కోసం రాష్ట్ర న్యాయశాఖకు పంపారు.
అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర న్యాయశాఖను తమిళిసై సౌందరరాజన్ కోరారు. మిగిలిన మూడు బిల్లులు ఇంకా గవర్నర్ పరిశీలనలోనే ఉన్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లుతో పాటు డీఎంఈ పదవీవిరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లులు ఇంకా పరిశీలనలోనే ఉంచారు.
6 నెలలుగా గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ : 2022 సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర సర్కార్ 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్.. అప్పటి నుంచి మిగతా ఏడు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరో 3 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపింది. వీటితో కలిపి మొత్తం 10 బిల్లులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
అజామాబాద్ పారిశ్రామిక, మోటారు వాహనాల పన్ను, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, వైద్యవిద్య డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయస్సు పెంపు కోసం చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, అటవీ విశ్వవిద్యాలయ బిల్లులు గత సెప్టెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీ రాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు ఇటీవల ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.
సుప్రీం విచారణపై నెలకొన్న ఉత్కంఠ : కొద్ది రోజుల క్రితం గవర్నర్ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో గవర్నర్ మూడు బిల్లులకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి: