రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాల కంటే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం కష్టంగా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే బదిలీ రుసుంతోపాటు ప్రత్యేకంగా మ్యూటేషన్ ఫీజును డీడీ రూపంలో చెల్లింపులు చేస్తారు. కాని రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆయా పత్రాలు అన్నీ సంబంధిత మున్సిపల్, పురపాలక, నగరపాలక సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్ ద్వారా వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఆస్తి కొనుగోలుదారుడు వెళ్లి తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించినట్లయితే.. పరిశీలన చేసి మ్యూటేషన్ పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంది. కాని ఆలా జరగడం లేదు.
కాళ్లరిగేలా తిరుగుతున్నా...
ముందే మ్యూటేషన్ ఫీజు చెల్లించినా... మళ్లీ మ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఆస్తికి సంబంధించిన పూర్తి పత్రాలూ ఇవ్వాల్సి వస్తోంది. అన్ని రకాల పత్రాలతో దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా వెంటనే మ్యూటేషన్ కావడం లేదు. అక్కడ కూడా అధికారుల దయతలిస్తేనే దరఖాస్తుదారుడి పని పూర్తవుతోంది. లేదంటే కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అయితే రెండు మూడు నెలలు తిరిగిన మ్యూటేషన్ పూర్తికాని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా ఆస్తి కొనుగోలు కంటే దానికి సంబంధించిన మ్యూటేషన్ పూర్తి చేసుకోవడమే కొనుగోలుదారుడికి కష్టంగా మారింది.
రిజిస్ట్రేషన్, పురపాలక శాఖలు సాఫ్ట్వేర్లు అనుసంధానంతో..
ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తి చేసి కొనుగోలుదారుడికి ఇచ్చేందుకు గత కొంత కాలంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేసింది. రిజిస్ట్రేషన్, పురపాలక శాఖల సాఫ్ట్వేర్లు అనుసంధానం చేయాల్సి ఉండడం వల్ల దీన్ని పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే పీటీఐఎన్ ఉండడం వల్ల సునాయాసంగా రెండు శాఖల సాఫ్ట్వేర్లను అనుసంధానం చేశారు. గత కొన్ని రోజులుగా దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తూ వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మ్యూటేషన్ జరుగుతుండడం వల్ల ప్రాంతాల వారీగా కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. అక్కడా సజావుగానే మ్యూటేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.
అధికారిక ప్రకటనే తరువాయి..
ఫలితంగా రిజిస్ట్రేషన్ల సమయంలోనే మ్యూటేషన్ ప్రక్రియనూ పూర్తిచేయాలని రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. నిర్మాణాలకు సంబంధించి మ్యూటేషన్‌ను సబ్రిజిస్ట్రార్లే చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కట్టడాలన్నింటికీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్-పీటీఐఎన్‌లు ఇప్పటికే ఉండడం వల్ల వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌లు పూర్తికాగానే క్షణాల్లో మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఖాళీ స్థలాలకు గుర్తింపు సంఖ్యలు..
ఇక ఖాళీ స్థలాలకు సంబంధించి క్రయవిక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగానే మ్యూటేషన్ ఇచ్చేట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు కొనసాగుతోంది. వీటికి ఆస్తి పన్ను వసూలు చేయనందున.. ఎలాంటి గుర్తింపు సంఖ్యలు లేవు. దీంతో ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించి వాటికీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు- పీటీఐఎన్‌లు మాదిరిగానే వేకంట్ ల్యాండ్ ట్యాక్స్ అలాట్‌మెంట్ నంబరు-వీఎల్‌టీఎఎన్‌ను కేటాయించి.. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యూటేషన్ కూడా చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పురపాలక శాఖలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి.
రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు చెక్!..
రెండు శాఖల సాఫ్ట్వేర్ అనుసంధానం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌కు వచ్చిన సమయంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖనే దానికి వీఎల్‌టీఎఎన్‌ను కేటాయించాలని భావిస్తోంది. ఖాళీ స్థలాలకు శాశ్వత గుర్తింపు సంఖ్య అందుబాటులోకి రావడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని.. అదే నంబరు ఆధారంగా ప్రభుత్వం ఆస్తి పన్ను విధించేందుకూ అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒకరి ఆస్తిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయించేందుకు అవకాశం లేకుండా నిలువరించినట్లు అవుతుందని రిజిస్ట్రేషన్ శాఖ అభిప్రాయపడుతోంది.
ఇందు కోసం రెండు శాఖలు సంయుక్తంగా కసరత్తు చేయాల్సి ఉండడం, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నందున మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదీ పూర్తయితే భవిష్యత్తులో డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరగడానికి అవకాశం లేదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచూడండి: Huzurabad By elections: హుజూరాబాద్ బరిలో 800 ఎంపీటీసీలు