Professors Retirement Age: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యుల పదవీ విరమణ వయసు 62 లేదా 63కి పెంచుతూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 9న విద్యాశాఖ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ వివిధ అంశాలను సమీక్షించారు. ఆ సందర్భంగా ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం పెండింగ్‌లో ఉందని అధికారులు ప్రస్తావించారు. ప్రస్తుతం అది 60 ఏళ్లుగా ఉందని, ఉద్యోగులకు 58 నుంచి 61కి పెంచారని, ఉద్యోగులకు మాదిరిగానే మూడేళ్లు పెంచడమా? ఆంధ్రప్రదేశ్ తరహాలో 62 చేయడమా? యూజీసీ మార్గదర్శకాల మాదిరిగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్నట్లుగా 65కి పెంచడమా?.. అన్న దానిపై స్వల్ప చర్చ జరిగింది.
ఈ క్రమంలో పెంచడానికి సీఎం అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మంత్రిమండలి ఆమోదం తీసుకొని అమలుచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. బహుశా 62 లేదా 63గా ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో 831 మంది మంది ఆచార్యులు పనిచేస్తుండగా... మరో 1600 ఖాళీలున్నాయి. వాటి భర్తీకి కూడా మంత్రిమండలి ఆమోదం తీసుకోవాలని ఆ సమావేశంలోనే సీఎం సూచించారు. బడుల బాగు పథకంపైనా వచ్చే మంత్రిమండలి సమావేశంలో స్పష్టత రానుంది.