పురపాలనలో వార్డు సభ్యులను క్రియాశీలకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు బాధ్యతలు, విధులు నిర్దేశించింది. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఉండే వార్డు సభ్యులను పాలనలో భాగస్వామ్యం చేస్తూ నిబంధనలు పొందుపరిచింది. పురపాలక చట్టం 56వ విభాగంలో కార్పోరేటర్లు, కౌన్సిలర్ల విధులు, బాధ్యతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో పారిశుద్ధ్యం, నీటిసరఫరా సరిగా ఉండేలా చూడటంతో పాటు.. వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించడమే కాకుండా... తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చటం సహా, పొడి చెత్త ప్రాసెసింగ్ కోసం చర్యలు తీసుకోవాలి.
జిల్లా కార్యచరణ ప్రణాళిక నిర్ణయించిన మేరకు వార్డులో మొక్కలు నాటి పరిరక్షణకు చర్యలు వార్డు సభ్యులే తీసుకోవాలి. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం బతికుండేలా చూడాలి. నీటి వృథా, నీటి నష్టాలు లేకుండా చూడటంతో పాటు... వీలైనంత వరకు బోర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలి. వార్డు పరిధిలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలి. చట్టం ద్వారా ఉన్న బాధ్యతలతో పాటు... రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అప్పగించే బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రభుత్వం ఇచ్చే శిక్షణకు వార్డు సభ్యులు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. కేవలం హోదాకే కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని పురపాలక చట్టం స్పష్టం చేస్తోంది.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'