రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా స్థిరాస్థి వ్యాపారం విస్తరించింది. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే... లేఅవుట్లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం చేయాలి. చాలా చోట్లా స్థిరాస్తి వ్యాపారులు సంబంధిత అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేస్తున్నారు. భవనాలు నిర్మించి అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటివరకు లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా..... రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చింది. ఇకపై అలా కుదరదు. అనుమతులు లేని లేఅవుట్లు, నిర్మాణాలకు రిజస్ట్రేషన్ చేయకూడదని... స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని లేఅవుట్లలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగినా.... భవిష్యత్తులో మళ్లీ క్రయవిక్రయాలు జరిగితే రిజిస్ట్రేషన్ చేయరు. కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టాల నిబంధనలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు.
అనుమతులు పొందిన లేఅవుట్లలోని స్థలాలు, నిర్మాణాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లు, క్రమబద్దీకరణ చేసుకున్న భవనాలకూ సడలింపు ఉంటుంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం... గ్రామకంఠంలో ఇప్పటికే నిర్మాణమైన భవనాలు, ఇతర నిర్మాణాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
అనుమతులు లేని స్థలాలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడం ద్వారా అక్రమాలకు అడ్డుకడ్డ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొనుగోలు చేసే వారు అనుమతి పత్రాలు చూపాలని అడిగే అవకాశం ఉంటుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్ల క్రయవిక్రయాలు ఆగిపోతాయని సర్కారు భావిస్తోంది.