TS Government plans to Develop Irrigation: కోటి 25 లక్షల ఎకరాల మాగాణి ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్రప్రభుత్వం.. రానున్న రెండేళ్లలో తన ప్రణాళికలు వివరించింది. రాష్ట్రంలో మొత్తం రెండున్నర లక్షల కోట్లకు పైగా వ్యయంతో 40 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. అందులో ఇప్పటికే 12 ప్రాజెక్టులు పూర్తి చేయగా వాటి నుంచి లక్షా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు రెండు లక్షల 60 వేల ఎకరాల స్థిరీకరణ జరిగినట్లు పేర్కొంది.
13,57,000 ఎకరాలకు స్థిరీకరణ: పాక్షికంగా పూర్తైన మరో 12 ప్రాజెక్టుల ద్వారా 19 లక్షల 46 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి కల్పించడం సహా 13 లక్షల 57 వేల ఎకరాల స్థిరీకరణ జరిగినట్లు తెలిపింది. 2021- 22లో లక్ష 64 వేలు, 2022 డిసెంబర్ నాటికి కొత్తగా 76 వేల ఎకరాలకు సాగునీరు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.డిసెంబర్ నాటికి 22 లక్షల 94 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరివ్వడంతోపాటు 16 లక్షల 17 వేల ఎకరాల స్థిరీకరణ జరిగినట్లు పేర్కొంది.
ప్రణాళికలు సిద్ధం: రాష్ట్రంలోని మొత్తం 75 లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని మరో 30 లక్షల ఎకరాల మేర స్థిరీకరణ జరిగినట్లు వివరించింది. మిగిలిన ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తిచేసి నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా చర్యలుచేపట్టినట్లు వివరించింది. 2023 - 24 లో కొత్తగా 17 లక్షల 20వేల ఎకరాలు, 2024-25 లో మరో 13 లక్షల 95 వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కాళేశ్వరం ద్వారా సాగునీరు అందేలా చూడడం: కాళేశ్వరం ద్వారా వచ్చే రెండేళ్లలో మరో 13 లక్షలకుపైగా, సీతారామ ద్వారా 3 లక్షల ఎకరాలకు పైగా, ప్రాణహిత ద్వారా 2 లక్షలు, వరదకాలువ ద్వారా మరో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదుల ద్వారా లక్షా 88 వేలు, కల్వకుర్తి ద్వారా లక్ష 50 వేల వరకు, ఎస్ఎల్బీసీ ద్వారా లక్ష 22 వేలకుపైగా, డిండి ద్వారా లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక నిర్దేశించుకుంది.
మార్చి నాటికి మిగిలిన ప్రాజెక్టులు పూర్తి: 2024-25 తర్వాత మిగిలిన 19 లక్షలకుపైగా ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వాలని భావిస్తోంది. గడచిన రెండేళ్లలో నీటిపారుదల శాఖ 38,547 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎఐబీపీ కింద రాష్ట్రానికి చెందిన 11 ప్రాజెక్టులకు డిసెంబర్ వరకు 4వేల 371 కోట్ల సాయం అందిందని, వాటిలో 3 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తికాగా మార్చినాటికి మిగతావి పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.
రాష్ట్రంలో సాగునీటి వనరులు: ఆ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాల సాగునీటి సామర్థ్యానికిగాను 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 86 ఆనకట్టలు, 10 26 కిలోమీటర్ల మేర పైప్‌నెట్ వర్క్, 33 వేల కిలోమీటర్ల పొడవునా కాల్వలు, 231 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉన్నట్లు తెలిపింది. నీటిపారుదల శాఖ పరిధిలో 13 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉందని వివరించింది.
ఇవీ చదవండి: