లాక్‌డౌన్ నిబంధనల సడలింపులపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన వేళ... రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కొంతమేర స్పష్టతనిచ్చింది. అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలను తొలగించింది. ఇక నుంచి రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదని పేర్కొంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పలు అంశాలపై రాని స్పష్టత
ఆలయాలు, ప్రార్థనా మందిరాల ప్రారంభం, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు అనుమతిపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ వాటి గురించి ప్రస్తావించలేదు. మెట్రోరైలు, సినిమాహాళ్లు, బార్లు, ఈత కొలనులు, వ్యాయామశాలల గురించి సైతం స్పష్టత ఇవ్వలేదు. వీటిపై ఒకటి రెండ్రోజుల్లో మళ్లీ స్పష్టత ఇచ్చే వీలుంది.
అదే మంచిదేమో..!
సరిహద్దు రాష్ట్రాల్లో కేసుల నమోదు అధికంగా ఉన్నందున ప్రస్తుతానికి అంతర్ రాష్ట్ర బస్సులు నడపకపోవడమే మంచిదన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు అనుమతివ్వలేదు. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వ్యక్తిగత వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపింది. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు కొనసాగుతాయని... రాష్ట్రంలో కరోనా కంటైయిన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు ప్రకటించింది.
ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు