Telangana State Police Department : తెలంగాణ ఏర్పాటైన తర్వాత 9 ఏళ్లలో పోలీస్ శాఖకు రూ.59 వేల 200 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పోలీస్ శాఖలో కల్పించిన మౌలిక సదుపాయాలు.. సాధించిన పురోగతిపై పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రూ.775 కోట్లు వెచ్చించి 551 పోలీస్‌స్టేషన్లకు భవనాలు నిర్మించగా.. ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసినట్లు వివరించింది. హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. లక్ష సీసీటీవీలకు చెందిన దృశ్యాలను పరిశీలించేలా పరికరాలను సమకూర్చారు. పోలీస్ నియమాక మండలి ద్వారా 48 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్లు పేర్కొంది. మహిళల భద్రత కోసం 331 షీ-టీమ్స్, 12 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి నిందితులపై పీడీ చట్టం నమోదు చేసి జైలుకు పంపేలా ఆర్డినెన్స్ తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
- Suraksha Day in Decade Celebrations : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం
- TS prisons department : తెలంగాణ జైళ్లశాఖకు 6 బంగారు పతకాలు
కొత్త జోన్లు ఏర్పాటు: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుసంధానించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల 66 వేల 792 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ప్రతి 1000 మందికి 30 సీసీటీవీ సర్వైలెన్స్ అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలో హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచింది. శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో 11 పోలీస్ జిల్లాలు, 7 కమిషనరేట్లు, 175 పోలీస్‌స్టేషన్లు, 38 సర్కిళ్లు, 24 సబ్‌డివిజన్లు 4 ఐఆర్ బెటాలియన్లు, 2 మల్టీజోన్‌లు, 7 జోన్లను కొత్తగా ఏర్పాటు చేశారు.
సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు కొత్త విభాగాలు అందుబాటులోకి తెచ్చారు. మహిళలు తమ సమస్యలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతేడాది 5145 ఫిర్యాదులు అందగా.. వాటిని సమర్థవంతంగా పరిష్కరించారు. బాడీవోర్న్ కెమెరాలు, బ్రీత్ ఎనలైజర్, కంప్యూటర్ ట్యాబ్‌లు, హైఎండ్ కంప్యూటర్లు, ఇతర పరికరాల కోసం రూ.79 కోట్లు ఖర్చు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను ఆధునికీకరించడం ద్వారా వేగంగా.. కచ్చితమైన నివేదిక వస్తోందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
Telangana Police Results 2023 : ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సుమారు 18 వేల పోలీసుల నియామక ప్రక్రియ పూర్తయితే పోలీసు వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే తుది రాత పరీక్షల ఫలితాలు సైతం నియామక మండలి విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి.. అందులో మెరిట్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: