Revanth Reddy Review On Outer Ring Road: ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్డును.. ఇప్పుడు ప్రైవేటుకు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యతలు ఇచ్చారో హెచ్‌ఎండీఏ అధికారులు బయటపెట్టాలని కోరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై ఆరోపణలు చేశారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించామని చెప్పారు. ఇందుకోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,696 కోట్లు పెట్టుబడులు పెట్టిందని వివరించారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో రింగ్ రోడ్డును సైతం కాంగ్రెస్‌నే నిర్మించిందని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం తాము నిర్మించిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డులే అని వెల్లడించారు.
Outer Ring Road: ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ మిత్ర బృందం ఆదాయ వనరుగా వాడుకుందని విమర్శించారు. అందుకే గత 4 ఏళ్ల నుంచి టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారన్నారు. దీనిపై వచ్చే ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు కల్వకుంట్ల కుటుంబం ఆలోచించిందని.. అందుకే 30 ఏళ్లు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: కనీసం రూ. 30వేల కోట్లు ఆదాయం వచ్చే రింగ్ రోడ్డును రూ.7,380 కోట్లకే ముంబయి కంపెనీకి తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. ఈ తాకట్టు వెనుక సోమేశ్ కుమార్ ఉన్నాడని.. అరవింద్ కుమార్ సంతకం చేశారని తెలిపారు. ప్రభుత్వం దిగిపోయే ముందు తీసుకున్న నిర్ణయాలను వచ్చే ప్రభుత్వం సమీక్ష చేస్తోందని హెచ్చరించారు. దేశంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని.. ఇందులో సుమారు రూ. 1,000 కోట్లు చేతులు మారి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని చెప్పారు.
"తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఈ కుంభకోణంపైనే విచారణ జరిపిస్తాం. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది. ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు. రింగ్ రోడ్డును టెండర్ విధానాలపై విచారణ సంస్థలు అన్నింటికి ఫిర్యాదు చేస్తాం. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: