కరోనాయే కాదు మరెన్నో వైరస్‌ల అంతానికి.. వ్యాధుల నివారణ, చికిత్సల కోసం వందల సంఖ్యలో టీకాలతో పాటు ఔషధాల తయారీకి ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది జినోమ్‌వ్యాలీ (Genome Valley). హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో 2000 సంవత్సరంలో 1200 ఎకరాల్లో ప్రారంభమైన ఈ ఔషధాల గని దేశంలోని మొట్టమొదటి అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాల సమూహం.. పారిశ్రామిక శిక్షణ కేంద్రం. తెలంగాణ జీవశాస్త్రాల రంగం అభ్యున్నతికి తోడు ఔషధరంగం అప్రతిహతంగా అభివృద్ధి చెందుతుండడంతో ప్రభుత్వం జినోమ్‌వ్యాలీ (Genome Valley) రెండో దశ అనంతరం 19 వేల ఎకరాల్లో రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లా శివార్లలో హైదరాబాద్ ఔషధ నగరిని ఏర్పాటు చేస్తోంది. మున్ముందు కొత్త పరిశ్రమలు, సంస్థలు కొన్ని అటువైపు మళ్లనున్నాయి.
జినోమ్‌వ్యాలీ (Genome Valley)... పారిశ్రామిక, విజ్ఞాన పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రయోగశాలలు, వ్యవసాయ జీవ సాంకేతిక, పరిశోధన, యాజమాన్య సంస్థలు, పరీక్ష కేంద్రాల సమ్మిళితం. జీవశాస్త్రాల పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి ఆలవాలమిది. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలతో, 40 వరకు పరిశోధన సంస్థలతో ప్రపంచ ఔషధ రాజధానిగా హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చింది. ఇక్కడ సుమారు 20 లక్షల చదరపు అడుగుల స్థలంలో ప్రయోగశాలలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు విస్తరిస్తున్నాయి. తాజాగా కెనడా, సింగపూర్‌లకు చెందిన ప్రసిద్ధ సంస్థలు ఇవాన్ హో కేంబ్రిడ్జ్, లైట్‌హౌస్ కాంటన్ కలిసి రూ.740 కోట్లతో పది లక్షల చదరపు అడుగుల స్థలంలో భారీ ప్రయోగశాల అభివృద్ధి చేస్తున్నాయి.
ఇదీ వ్యాలీ ప్రస్థానం
మూడు దశల్లో 1200 ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేసింది. ఎంఎన్ పార్కు, అలెగ్జాండ్రియా నాలెడ్జ్ పార్క్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి వాటి ఏర్పాటుతో ఇంక్యుబేటర్లు, ప్రయోగశాలలు, పరిశ్రమల తయారీ స్థలాలు సమకూరాయి. 18 దేశాలకు చెందిన 200 అంతర్జాతీయ బహుళజాతి ఔషధ, జీవశాస్త్ర, బయోటెక్ సంస్థలు పరిశ్రమలు, అభివృద్ధి, పరిశోధన కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌కు ప్రపంచ టీకాల రాజధాని ఖ్యాతి తెచ్చింది జినోమ్‌వ్యాలీ (Genome Valley)నే. ఏటా ఆరు బిలియన్ల డోసుల టీకాలు ఇక్కడ తయారవుతున్నాయి. ప్రపంచదేశాలు ఉపయోగించే టీకాల్లో 33 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి టీకాల తయారీ సంస్థలు భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఇక్కడే ఉన్నాయి.
తెలంగాణకు మణిహారం
జినోమ్‌వ్యాలీ (Genome Valley)తెలంగాణకు మణిహారం లాంటిది. కొవాగ్జిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్ నిబద్ధత, కృషి ప్రశంసనీయం. జీవశాస్త్రాల పెట్టుబడులను రూ. 7.50 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో రాష్ట్రం పురోగమిస్తోంది. త్వరలోనే ప్రపంచ స్థాయి ఔషధనగరిని, జీవ ఔషధ పరిశ్రమల సౌకర్యాల కేంద్రం బీహబ్‌ను ప్రారంభిస్తాం.
- మంత్రి కేటీఆర్
ఇవీ ప్రత్యేకతలు
ప్రపంచంలోని మొదటి పది పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లోని ఆరు జినోమ్‌వ్యాలీ (Genome Valley)లోనివే. బయోటెక్నాలజీ, బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్స్, టీకాలు, న్యూట్రాస్యూటికల్స్, బయోలాజికల్స్, బయోసిమిలర్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, పరిశోధన, అభివృద్ధికి పెట్టింది పేరు. ఔషధరంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దడంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. మొత్తం భారతీయ బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం, బల్క్ డ్రగ్స్ ఎగుమతుల్లో 50 శాతం ఇక్కడి నుంచే సాగుతున్నాయి. పోలియో, హెచ్1ఎన్1, రోటావైరస్, రేబిస్, జికా, టైఫాయిడ్, డీటీపీ, టీటీ, జేఈ, డిఫ్తీరియా తదితర వ్యాధులకు వ్యాక్సిన్లు ఇక్కడ అభివృద్ధి అవుతున్నాయి. క్యాన్సర్ చికిత్స కోసం ఉంబ్రలీసిబ్ డ్రగ్ ఇటీవలే ఆమోదం పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద రేబిస్ వ్యాక్సిన్ తయారీదారుగా కూడా ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లక్షల సంఖ్యలో మోతాదులను తయారు చేసే సామర్థ్యం వీటికి ఉంది.
బయోహబ్
- బయో ఫార్మా పరిశోధనలకు ఊతమిచ్చేలా సుమారు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలల సౌకర్యంతో పాటు, ఇంక్యుబేటర్ ఒకటి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలుగుతాయి.
- జాతీయ వ్యాధుల నివారణ సంస్థ (ఎన్‌సీడీసీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ థెరపీస్‌ను జినోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
భారీగా ఉపాధి
20.4 లక్షల చదరపు అడుగుల బహుళ పరిశోధనల ప్రయోగశాలలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేలమంది శాస్త్రవేత్తలతో పాటు మరో 50 వేలమంది ఇతరులకు ఉపాధి లభిస్తోంది.
కరోనా వేళ అందరి దృష్టి వ్యాలీపైనే
కరోనా వల్ల జినోమ్‌వ్యాలీ ప్రాశస్త్యం ప్రపంచానికి తెలిసివచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తయారుచేసి చరిత్ర సృష్టించింది. 140కి పైగా ప్రపంచ పేటెంట్లతో అద్భుతమైన ఆవిష్కరణలు, 16 టీకాలు, 4 బయో థెరప్యూటిక్స్, 116 కంటే ఎక్కువ దేశాల్లో రిజిస్ట్రేషన్‌లతో అత్యుత్తమ ఔషధ సంస్థల్లో ఒకటిగా భారత్ బయోటెక్ గుర్తింపు పొందింది. టీకాల పురోగతి, పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణకు గాను ఇటీవలే ఈ సంస్థ ‘జినోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు’ను అందుకుంది. బయోలాజికల్-ఇ సైతం కరోనా టీకా తయారీకి పూనుకుంది.
జినోమ్‌వ్యాలీ.. ఔషధరంగ ప్రగతికి దిక్సూచి. దేశానికి గర్వకారణం
నవంబరు 28న భారత్ బయోటెక్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య
విశ్వవిఖ్యాతి
అధునాతన సాంకేతికతతో కాలుష్యరహితంగా దీనిని తీర్చిదిద్దారు. ప్రతీ నెలా ఎంతోమంది దేశ, విదేశీ ప్రతినిధులు దీనిని సందర్శిస్తారు. గత ఏడాది విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 64 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ జీవశాస్త్రాల సమూహమిది
డిసెంబరు 9న జినోమ్‌వ్యాలీని సందర్శించిన 64 దేశాల రాయబారుల ప్రశంస.
ఔషధాల నిల్వ కేంద్రం కావాలి
- టీకా తయారీ సంస్థలు పెద్దఎత్తున టీకాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో జినోమ్‌వ్యాలీలో ఔషధాల నిల్వ కేంద్రాలు (జీఎంఎస్‌డీ) ఏర్పాటు చేయాల్సి ఉంది.
- జినోమ్‌వ్యాలీకి తెలంగాణ ప్రభుత్వం 2017లో పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార హోదా కల్పించింది. ఇక్కడ ఏర్పాటయ్యే సంస్థలకు ఏకగవాక్ష విధానంలో సత్వర అనుమతులను మంజూరు చేస్తోంది.
వీటీసీఎల్ శాశ్వత కేంద్రం..
టీకా పరీక్ష, ధ్రువీకరణ ప్రయోగశాల(వీటీసీఎల్)లను హైదరాబాద్, పుణెలలో ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మొదటగా గచ్చిబౌలిలోని బయోటెక్ శాఖ స్థలంలో ఈ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లభ్యత, సంస్థలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా శాశ్వత కేంద్రం జినోమ్‌వ్యాలీలో స్థాపించాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది.
ఇదీ చూడండి: ts cabinet meeting: ఉద్యోగాల భర్తీ ఆమోదమే ప్రధాన అజెండా