ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా, మోసపూరిత విధానంలో కొన్ని సందర్భాల్లో డిపాజిట్ చేసిన మొత్తాల నుంచి నగదు తీయడం... అనుమతి లేకుండా కొత్త ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు చేసిన నేపథ్యంలో ఆర్థికశాఖ వాటిని అరికట్టే దిశగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించింది. అన్ని రకాల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ వెంటనే నమోదు చేయాలని... ఆయా ఖాతాలకు ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి వచ్చే నెల పదో తేదీ నాటికి నిర్ధేశిత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంప్యానెల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎంపానెల్ చేసిన బ్యాంకుల్లోనే ఖాతాలు ఉండాలని... ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు తెరవాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లలో ప్రభుత్వ నిధులు జమ చేసేందుకు వీల్లేదని తెలిపింది.
బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను సంబంధిత శాఖాధిపతి, డ్రాయింగ్ లేదా ఫైనాన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సంయుక్తంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. భౌతిక, ఆన్లైన్ రికార్డులను పక్కాగా నిర్వహించి... ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయించాలని తెలిపింది. ప్రభుత్వ ధనానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలను సంబంధిత శాఖల ఖాతాలకు ఎలక్ట్రానిక్ రూపంలోనే నిర్వహించాలని... నగదు లావాదేవీలను అనుమతించరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖాతాలన్నీ కూడా అధికారిక ఈ-మెయిల్స్, మొబైల్ నంబర్లకు మాత్రమే లింక్ చేయాలని... ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు క్రాస్‌చెక్ చేసుకోవాలని సూచించింది. ఏ ఒక్క ప్రభుత్వ శాఖ, సంస్థ, కార్పొరేషన్ అన్ని రకాల ఖాతాలను మూడుకు మించి బ్యాంకుల్లో కొనసాగించరాదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అన్ని రకాల ఖాతాల వివరాలను ప్రతి నెలా ఐఎంఎఫ్ఐఎస్ పోర్టల్‌లో ప్రతి నెలా పొందుపర్చాలని పేర్కొంది.
ఇదీ చూడండి : SBI Adopts Tigers: 15 పులులను దత్తత తీసుకున్న ఎస్బీఐ